ఏఐతో వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతీ రంగంలోనూ దూసుకుపోతోంది. తాజాగా వైద్యరంగంలో కూడా తనదైన ముద్రవేసి, సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. జీవితంలో ఇంక మాట్లాడలేని జబ్బు బారిన పడిన వ్యక్తుల చేత కూడా వారు చెప్పాలనుకున్న మాటలను కంప్యూటర్ స్క్రీన్‌పై చూపిస్తోంది. అమ్యూట్రోఫిక్ లేటరల్ స్లారియోసిస్ (ఏఎల్‌ఎస్) అనే వ్యాధి కారణంగా గొంతును కోల్పోయిన వ్యక్తికి ఐదేళ్ల తర్వాత గొంతును ప్రసాదించింది. క్యాసీ హరెల్ అనే వ్యక్తి ఈ జబ్బు కారణంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించడంతో, కండరాలు బలహీనమయి వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఈ వ్యాధి ముదిరి క్రమేపీ గొంతును కూడా కోల్పోయారు. గతేడాది కాలిఫోర్నియా డాక్టర్లు అతని మెదడులో ఎలక్ట్రోడ్స్‌ను ఇంప్లాంట్ చేశారు. అతని మెదడులో భావాలను కనిపెట్టి బయటకు చెప్పగలిగేలా కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు. మెదడు వెలుపలి ప్రాంతంలో అమర్చిన డివైజ్ సహాయంతో అతడు మాట్లాడనుకున్నప్పుడు దవడలు, ముఖకవళికలను బట్టి కంప్యూటర్ స్క్రీన్‌పై ఆ మాటలు 90 శాతానికి పైగానే ఖచ్చితత్వంలో రికార్డవుతున్నాయి. స్పష్టంగా అతను చెప్పాలనుకున్న విషయం ఏఐ ద్వారా కనిపెట్టి కంప్యూటర్ స్క్రీన్‌లో ప్రత్యక్షమవడంతో డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. 8 నెలలుగా కొనసాగుతున్న ఈ విధానంలో అతడు దాదాపు 99 శాతం విజయవంతంగా తాను చెప్పాలనుకున్న విషయం చెప్పగలుగుతున్నారు. ఇది విజ్ఞానరంగంలో కీలకమైన మలుపు అని చెప్పవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

