రైలులో తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి సజీవదహనం
కేరళలో కోజికోడ్ వద్ద కదులుతున్న రైలులో తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఈ ఘటనలో ఏడాది వయసున్న పాపతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం అలప్పుళ- కన్నూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి మరొకరితో వాగ్వాదం పెట్టుకుని, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనితో ప్రయాణికులందరూ హాహాకారాలు చేశారు. వెనువెంటనే ఆ మంటలు ఇతరులకు కూడా వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెద్దప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి, కాలిన గాయలతో ఉన్న 8 మందిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ముగ్గురు ప్రయాణికులు కనిపించక పోవడంతో పోలీసులు రైల్వే ట్రాక్‌పై గాలింపు చర్యలు చేపట్టగా, వారికి 100 మీటర్ల దూరంలో చిన్నారితో సహా ఇద్దరి మృతదేహాలు కన్పించాయి. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు ప్రమాద సమయంలో రైలు దిగడానికి ప్రయత్నించి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో బ్యాగులో పెట్రోల్ బాటిల్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నారు పోలీసులు. నిందితుడు చైన్ లాగటంతోనే పారిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. మరోవ్యక్తి ఆప్రదేశంలో బైకుపై వేచి ఉన్నట్లు కూడా గమనించినట్లు తెలిపారు. ఈ ఘటన కోరపుళ రైల్వే వంతెన వద్ద జరిగింది. దీనితో ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.