Home Page SliderTelangana

పెళ్లి టైమ్‌కి నవ్వు బాగా రావాలని, ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్‌లో వ్యక్తి మృతి

కొందరు ఎందుకు ఏం చేస్తారో అసలే తెలియదు. ఇప్పటికే సవాలక్ష రోగాలు, సమస్యలతో సతమవుతున్న ప్రస్తుత కాలంలో కొందరు అనవసరమైన వాటి జోలికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిని ఎందరినో చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ యువకుడు, పెళ్లికి ముందు తన నవ్వు అందంగా కనిపించేలా చేసుకోవాలని ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆపరేషన్ సమయంలో మత్తు ఎక్కువగా ఇవ్వడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 28 ఏళ్ల లక్ష్మీ నారాయణ వింజం ‘స్మైల్ డిజైనింగ్’ ప్రక్రియలో మరణించాడు. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి, పెళ్లికి ముందు చిరునవ్వు బాగా వచ్చేలా చేసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎంఎస్‌ ఇంటర్నేషనల్‌ డెంటల్‌ క్లినిక్‌లో 28 ఏళ్ల లక్ష్మీనారాయణ వింజాం ‘స్మైల్‌ డిజైనింగ్‌’ ప్రక్రియలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ చేసే సమయంలో మత్తు ఎక్కువగా ఇవ్వడం వల్లే (అనస్థీషియా ఓవర్ డోస్) చనిపోయాడని లక్ష్మీనారాయణ తండ్రి ఆరోపించారు. సర్జరీ సమయంలో కొడుకు స్పృహతప్పి పడిపోవడంతో సిబ్బంది తనకు ఫోన్ చేసి దవాఖానాకు రమ్మని చెప్పారని రాములు తెలిపారు. ” సమీపంలోని ఆసుపత్రికి తరలించాం, అక్కడ వైద్యులు తీసుకువచ్చిన వెంటనే మరణించినట్లు ప్రకటించారు,” అని చెప్పారు. శస్త్రచికిత్స గురించి తన కుమారుడు తమకు తెలియజేయలేదన్నారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో క్లినిక్‌ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేశారు. ఆసుపత్రి రికార్డులు, సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.