ఢిల్లీ కోచింగ్ సెంటర్ ట్రాజెడీలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ ట్రాజెడీలో ముగ్గురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కోచింగ్ సెంటర్ల నియంత్రణకు గాను కొత్త చట్టాలు రూపొందాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అతిశీ పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం కారణంగా బేస్‌మెంట్‌లోకి వరద నీరు రావడంతో విద్యార్థులు మృతి చెందారు. ఈ కొత్త కమిటీలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయనున్నట్లు అతిశీ తెలిపారు. చట్ట వ్యతిరేకంగా బేస్‌మెంట్లను కోచింగ్ సెంటర్లుగా ఉపయోగిస్తున్న వారిపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇలా బేస్‌మెంట్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న 30 కోచింగ్ సెంటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. రాజేంద్రనగర్, ముఖర్జీనగర్, లక్ష్మీ నగర్, ప్రీతి విహార్‌లలో ఈ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. బాధిత కుటుంబాలకు రూ.5 కోట్లు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన ఏడుగురిని ఇప్పటి వరకూ పోలీసులు అరెస్టు చేశారు.