ఎలాన్ మస్క్‌కు భారీ షాక్..ఉల్కాపాతంగా పేలిపోయిన రాకెట్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. రూ.850 కోట్లకు పైగా ఖర్చుతో మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్ స్పేస్ షిప్ మెగా రాకెట్ విఫలమయ్యింది. టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5.30 గంటలకు ప్రయోగించిన ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అయితే అంతరిక్షంలో చేరి, భూకక్ష్యలో ప్రవేశపెట్టబడే సమయానికి అది పేలిపోయింది. భారీ ఉల్కాపాతంలా భూమి పైకి శకలాలు దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాలలో ఈ శకలాలు తారాజువ్వలుగా కనువిందు చేశాయి. వీటివల్ల విమానాలకు సైతం అంతరాయం ఏర్పడింది. ఈ శకలాలు దక్షిణ ప్లోరిడా నుండి 500 కిలోమీటర్ల దూరంలోని బహమాస్‌లో పడ్డాయి. వీటివల్ల ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పేస్ ఎక్స్‌కు సంబంధించిన రెండవ ప్రయోగం కూడా విఫలమవడంతో నిరాశ చెందింది. వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడించింది.