విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజి
విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజిని ప్రకటించింది. ఏకంగా రూ.11,500 కోట్ల ఆర్థిక సహాయం చేయడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. నేడు కేంద్రం అధికారికంగా ప్రకటించబోతోంది. తీవ్ర ఆర్థిక కష్టాలలో ఉన్న స్టీల్ కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి రంగం సిద్దమయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రధాని మోదీని కలిసి విశాఖ ఉక్కుకు సహాయం అందించాలని కోరారు. దీనికి ఆయన ఆమోదం తెలిపినట్లు సమాచారం. కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి ఇటీవల ప్లాంటును సందర్శించారు. ఈ సందర్శనలో స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన ఇబ్బందులు రాష్ట్ర మంత్రులు, కార్మిక సంఘాల నేతలు ఆయనకు విన్నవించారు. అప్పుల భారం, ముడిసరుకు, కోర్టు ఎటాచ్‌మెంట్లు వంటి ఇబ్బందులను అధిగమించడానికి రూ.18 వేల కోట్లు అవసరం అవుతుందని అని అంచనాలు వేశారు. ప్రస్తుతం ఈ భారీ ప్యాకేజి వల్ల విశాఖ ఉక్కు మళ్లీ గాడిలోకి వస్తుందని కార్మిక సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

