BusinessHome Page SliderNationalNewsviral

పుష్కర్ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా రూ.15 కోట్ల గుర్రం, రూ.23 కోట్ల గేదె

. పుష్కర్ లో అతిపెద్ద పశువుల ప్రదర్శన, వ్యాపార లావాదేవీలు
. ప్రధాన ఆకర్షణలుగా షాహ్‌బాజ్ గుర్రం, అన్మోల్ గేదె
. మేళాలో వేల సంఖ్యలో పశువులు, గుర్రాలు, ఒంటెలు, గొర్రెలు, భెంసలు
. ప్రతిష్టాత్మకమైన భారతీయ పశుసంపద
పుష్కర్: రాజస్థాన్‌ లోని పుష్కర్ పట్టణం ప్రతీ సంవత్సరం జరిగే అంతర్జాతీయ క్యాటిల్ ఫెయిర్ ఈసారి అదిరిపోయే రికార్డులు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పశువుల ప్రదర్శనలు, వ్యాపార లావాదేవీలకు పేరుగాంచిన ఈ మేళాలో ఈ ఏడాది “షాహ్‌బాజ్” అనే గుర్రం, “అన్మోల్” అనే గేదె (భెంస) ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఎందుకంటే చండీగఢ్ రైతు తీసుకొచ్చిన గుర్రం ‘షాబాజ్’ కు రూ.15 కోట్లు.. రాజస్థాన్ కు చెందిన రైతు తీసుకువచ్చిన గేదె ‘అన్మోల్’ కు రూ.23 కోట్లు ధర పలికిందని నిర్వాహకులు చెప్పారు.
హర్యాణాకు చెందిన “అన్మోల్” ముర్రా జాతి గేదె పాలు, శరీర ఆకృతి, నిర్వహణ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. యజమాని చెప్పినదాని ప్రకారం, అన్మోల్‌కు ఇప్పటివరకు రూ. 23 కోట్ల వరకు ఆఫర్‌ వచ్చాయి. “అన్మోల్‌ ముర్రా జాతి గర్వకారణం. దీని పాలు కిలోకు 12 శాతం ఫ్యాట్‌ తో అత్యుత్తమమైనవి,” అని యజమాని సునీల్ చౌహాన్ చెప్పారు. ఈ గేదెకు రోజూ పాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్ పెట్టి పెంచుతున్నట్లు రైతు చెప్పారు.
ఇక చండీగఢ్‌కి చెందిన ఈ “షాహ్‌బాజ్” గుర్రం రాజపుతానా వంశానికి చెందినదని యజమాని తెలిపాడు. “షాహ్‌బాజ్ మా కుటుంబానికి గౌరవం. దాని శిక్షణకు ప్రత్యేక ట్రైనర్లు ఉన్నారు,” అని యజమాని అమీర్ సింగ్ తెలిపారు. దాని వయసు రెండున్నరేళ్లు. దాని నిగనిగలాడే చర్మం, అద్భుత శిక్షణ, కదలికలు చూసి సందర్శకులు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ గుర్రానికి రూ. 15 కోట్లు వరకు ధర ప్రతిపాదించారని వార్తలు వచ్చాయి.ఈ గుర్రం బ్రీడ్ రూ.2 లక్షలు పలుకుతోందట.
ఈ ఫేర్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో పశువులు, గుర్రాలు, ఒంటెలు, గొర్రెలు, భెంసలు పాల్గొన్నాయి. పుష్కర్ సరస్సు పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ ఉత్సవం స్థానిక ఆచారాలు, సంగీతం, హస్తకళలతో కలసి పర్యాటకులను ఆకట్టుకుంది. ఒంటెల పోటీలు, గుర్రాల ప్రదర్శనలు, కళాత్మక సంగీత రాత్రులు ఈ మేళాలో ప్రధాన ఈవెంట్లుగా నడుస్తాయి. పుష్కర్ మేళా ఈసారి గుర్రాలు, భెంసలు, ఒంటెలతోపాటు భారతీయ పశుసంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. షాహ్‌ బాజ్, అన్మోల్ ఇప్పుడు కేవలం జంతువులు మాత్రమే కాదు. భారతీయ పశుసంపద ప్రతిష్టకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.