మునుగోడు ఎన్నికల జాబితాపై హైకోర్టులో విచారణ
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు తెలంగాణా ఉన్నత న్యాయస్థానం ఈ రోజు దీనిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ముందుగా పిటిషనర్ తరుపు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజక వర్గంలోని వివిధ మండలాలలో ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందన్నారు. అయితే ఈ నమోదు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా చేశారన్నారు. ఫార్మ్-6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదయ్యాయని ఆమె కోర్టుకు తెలియజేశారు. అనంతరం ఎన్నికల సంఘం తరుపున అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇంకా తుది ఓటర్ల జాబితాను ప్రకటించలేదన్నారు. అయినా ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటూనే ఉంటారన్నారు. ఈ మేరకు మునుగోడులో జనవరి 2021 వరకు 2.22 లక్షల ఓట్లు ఉండగా.. ప్రస్తుతం అవి 2.38 లక్షలకు చేరాయన్నారు. ఇటీవల కాలంలో కొత్తగా 25 వేల ఓట్లు నమోదవ్వగా..వాటిలో 7 వేల ఓట్లు తొలగించారని తెలిపారు. ఈ విధంగా ఓటర్ల నమోదు ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ విచారణలో ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఈసీకీ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా నమోదైన ఓటర్ల జాబితా నివేదికను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ.. హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

