కుప్పం దిశగా దూసుకొస్తున్న గజరాజుల గుంపు
కర్ణాటక అరణ్యాల నుండి 70 ఏనుగులతో కూడిన గుంపు కుప్పం దిశగా దూసుకొస్తోంది. ఈ విషయాన్ని కర్ణాటక అటవీ శాఖ అధికారులు ధృవపరిచారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ పరిసర ప్రాంతాల గ్రామాలలోని ప్రజలు రాత్రులలో పొలాల వైపుగా వెళ్లొద్దని పేర్కొన్నారు. దీనితో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ గుంపు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు ప్రాంతాలలో ఇవి పంటలను నాశనం చేసినట్లు సమాచారం. వికోట మండలంలో 13 ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం సంచరించాయి. అక్కడి పంటలను నాశనం చేశాయి. కృష్ణాపురం, మోట్లపల్లి, జవునిపల్లి, మిట్టూరు తదితర గ్రామాల వద్ద కూరగాయల పంటలను కూడా నాశనం చేశాయి.

