పిల్లలకు అన్నం పెట్టలేని చేతకాని ప్రభుత్వం
అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు నడుపుతున్నామని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పురుగులు లేని అన్నం పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులున్న అన్నం వడ్డించిన ఘటనపై ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇకముందు తానే సమీక్షలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాటలకు విలువ లేకుండా పోయిందని, విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హెచ్చరికలు వట్టి మాటలే అయ్యాయని ఆయన అన్నారు. రెండేళ్లుగా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉండగా, ఈ వ్యవధిలో సమీక్షలు జరగకపోవడమే కాక, కల్తీ ఆహారం వడ్డించిన బాధ్యులపై ఎలాంటి శిక్షా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదని , ఆచరణలో దిశా నిర్దేశం లేదని ’’ హరీశ్ రావు వ్యాఖ్యానించారు . పురుగులున్న అన్నం వడ్డించడంపై విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు . ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి హోదాలో బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని ఆయన మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు, స్కాంలే కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ వ్యవహారశైలి ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుందని హరీశ్ రావు విమర్శించారు. బడిపిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని ప్రభుత్వం రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చలేదని వ్యాఖ్యానించిన ఆయన, ఆసిఫాబాద్ ఘటనపై తక్షణ చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

