క్వీన్ ఎలిజబెత్-2కు తుది వీడ్కోలు
బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. వెస్ట్‌మినిస్టర్ హాల్‌లోని క్యటాఫాక్‌పై ఉన్న రాణి శవపేటికను తొలుత వెస్ట్‌మినిస్టర్ అబే చర్చికి తీసుకెళ్లారు. అక్కడ దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాణి ఎలిజబెత్ 96 ఏళ్లు జీవించారు. దీనికి గుర్తుగా చర్చిలో 96 సార్లు గంటను మోగించారు. రాణి ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం వెస్ట్‌మినిస్టర్ అబే చర్చిలోనే జరిగింది. బ్రిటన్ రాజు, రాణిల పట్టాభిషేకం కూడా ఈ చర్చిలోనే నిర్వహించడం సాంప్రదాయం.

రాజు ఫిలిప్ సమాధి పక్కనే ఖననం
వెస్ట్‌మినిస్టర్ అబే చర్చి నుంచి రాణి శవపేటికను విండ్సన్ క్యాసిల్‌కు తీసుకెళ్లి సెయింట్ జార్జ్ చాపెల్ కింద ఉన్న రాయల్ వాల్ట్‌లోని ఒక గదిలో ఖననం చేశారు. గతేడాది మృతి చెందిన రాజు ఫిలిప్ సమాధి పక్కనే ఎలిజబెత్ శవపేటికను ఉంచారు. రాజకుటుంబానికి చెందిన 24 మందిని కూడా ఈ గదిలోనే ఖననం చేశారు. ఎంతో ఆడంబరంగా నిర్వహించిన ఇలాంటి అంత్యక్రియల కార్యక్రమాన్ని చివరిసారిగా 60 ఏళ్ల క్రితం విన్‌స్టన్ చర్చిల్‌కు నిర్వహించారు.

తుపాకీ క్యారేజ్‌పై అంతిమ యాత్ర..
రాణి అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జపాన్, భారత్‌తో పాటు అనేక ఇతర దేశాలకు చెందిన 2 వేల మంది ప్రముఖులు పాల్గొన్నారు. బ్రిటన్ రాజకుటుంబం, ఆ దేశ రాజకీయ ప్రముఖులు, సైనిక, న్యాయవ్యవస్థ, స్వచ్ఛంద సంస్థల సభ్యులు అంత్యక్రియల్లో భాగస్వాములయ్యారు. అంత్యక్రియలను బ్రిటన్‌లోని దాదాపు 125 సినిమా థియేటర్లలో ప్రదర్శించారు. పార్కులు, రోడ్ల కూడళ్లు, పలు రద్దీ ప్రాంతాల్లో భారీ స్క్రీన్లతో లైవ్ ప్రసారాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది చూశారని అంచనా. క్వీన్ శవపేటికను ఆమె ముత్తాత క్వీన్ విక్టోరియా అంత్యక్రియలకు ఉపయోగించిన తుపాకీ క్యారేజ్‌పై తీసుకొచ్చారు. ఈ క్యారేజ్‌ను 1979లో చివరిసారిగా లార్డ్ మౌంట్‌బాటెన్ అంత్యక్రియల్లో ఉపయోగించారు.

పార్లమెంటు స్క్వేర్ గుండా అంతిమయాత్ర..
ఎలిజబెత్-2 గౌరవార్ధం 142 మంది నావికులు గాల్లో కాల్పులు జరిపారు. రాయల్ నేవీ, రాయల్ మెరైన్స్ అంతిమయాత్ర ఊరేగింపు పార్లమెంట్ స్క్వేర్ గుండా వెళ్లింది. ఇక్కడ నౌకాదళం, సైన్యం, వైమానిక దళ సభ్యులు రాయల్ మెరైన్స్ బ్యాండ్‌తో పాటు గార్డ్ ఆఫ్ హానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఊరేగింపునకు స్కాటిష్, ఐరిష్ రెజిమెంట్లు, బ్రిగేడ్ ఆఫ్ గూర్ఖాస్, 200 మంది సంగీత విద్వాంసులతో కూడిన రాయల్ ఎయిర్ ఫోర్స్ నాయకత్వం వహించాయి. శవపేటికను కింగ్ చార్లెస్, రాజకుటుంబ సభ్యులు అనుసరించారు.

ప్రపంచ అధినేతలకు భారీ భద్రత..
రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు రావడంతో భద్రతా ఏర్పాట్లు బ్రిటన్ పోలీసులకు సవాల్‌గా మారాయి. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులకు సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా అధికారులను నియమించారు. అంత్యక్రియలకు రష్యా, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, సిరియా, ఉత్తర కొరియాలను ఆహ్వానించ లేదు. క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్‌ను 70 సంవత్సరాల 214 రోజులు పాలించారు. ప్లాటినం జూబ్లీని జరుపుకున్న మొదటి బ్రిటన్ రాణిగా ఆమె గుర్తింపు పొందారు.

