Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

రైతు రాజ్యమే ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మం జిల్లాలో లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. చింతకాని మండలం వందనం గ్రామంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ. 35.75 కోట్లతో చేపట్టనున్న కొదుమూరు-వందనం ఎత్తిపోతల పథకం రెండో విడత పనులకు, అలాగే రూ. 5.35 కోట్ల వ్యయంతో ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గతంలో 2013లోనే ఈ లిఫ్ట్ మొదటి విడత పూర్తి చేసి 2,500 ఎకరాలకు నీరందించామని, ఇప్పుడు రెండో ఫేజ్ ద్వారా మరో 2,500 ఎకరాలను సాగులోకి తీసుకువస్తామని ప్రకటించారు. జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 2.79 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా, మున్నేరు-పాలేరు లింకు కెనాల్, జవహర్ లిఫ్ట్, రాజీవ్ ఫీడర్ కెనాల్ వంటి ప్రాజెక్టుల ద్వారా మరో 1.98 లక్షల ఎకరాలను స్థిరీకరించబోతున్నట్లు వివరించారు. సాగునీటితో పాటు రైతులకు సన్న వడ్లకు రూ. 500 బోనస్, ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి పథకాల కోసం ప్రభుత్వం రూ. 74,163 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.

విద్య, గృహ నిర్మాణ రంగాల్లోనూ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. మధిర నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం వేగంగా జరుగుతోందని, రాబోయే విద్యా సంవత్సరం నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రతి వారం బిల్లులు చెల్లిస్తున్నామని, ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, తక్కువ విద్యుత్ ఖర్చుతో, గ్రావిటీ ద్వారా ఎక్కువ పొలాలకు నీరందేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామని, అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.