ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు.. డ్రైవర్ సాహసం
ఓ డ్రైవర్ సమయస్పూర్తితో ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. ఘాట్ రోడ్డులో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యాయి. దీన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కాకినాడకు చెందిన ఆర్టీసీ బస్సు భద్రాచలం డిపో నుంచి కాకినాడకు బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు మారేడుమిల్లి -చింతూరు ఘాట్ రోడ్డుకు చేరుకునే సరికి బస్సు బ్రేకులు ఫెయిల్ అయినట్లు డ్రైవర్ సుబ్బారావు గుర్తించారు. బస్సులో ఉన్న మరో డ్రైవర్.. 36 మంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు ప్రమాదకర మలుపులను బస్సు దాటింది. తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే ఉన్న కొండను ఢీ కొట్టారు. దీంతో బస్సు ముందుభాగం లోపలికి చొచ్చుకుని వచ్చింది. దీంట్లో డ్రైవర్ రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. బస్సులోని 6 గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు,లారీ యూనియన్ ప్రతినిధులు కలిసి లారీతో బస్సును వెనుక్కి లాగి డ్రైవర్‌ను బయటికి తీశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి.. బస్సును కొండకు ఢీకొట్టించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడినందుకు డ్రైవర్‌ను ప్రయాణికులంతా అభినందించారు. వారంతా డ్రైవర్ సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు.