తాను తవ్విన గోతిలో తానే పడిన డ్రాగన్
డ్రాగన్ చైనా తాను తీసిన గోతిలో తానే పడింది. లేవలేక, చెప్పుకోలేక కిమ్మనకుండా ఊరుకుంది. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సబ్‌మెరైన్లు ప్రవేశించకుండా పసుపు సముద్రం అడుగున చైనా నిర్మించిన గొలుసుల ఉచ్చులో చైనాకు చెందిన అణు జలాంతర్గామే పడింది. ఈ దుర్ఘటనలో 55 మంది వరకూ చైనా నావికా సైన్యం దుర్మరణం పాలయ్యారు. దీనిపై బ్రిటన్‌కు చెందిన వార్తాసంస్థలలో పలు కథనాలు వచ్చాయి. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ అనే ప్రదేశంలో ఎల్లో సముద్రంలో ఆగస్టు 21న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన 350 అడుగుల అణుశక్తి సబ్ మెరైన్ 093-417 కు భారీ ప్రమాదం జరిగింది. దీనిలో బ్యాటరీల శక్తి అయిపోవడం వల్ల వ్యవస్థలు పని చేయడం మానేసి, గాలి కలుషితమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడింది. దీనిలో ఏడుగురు ఆఫీసర్లతో కలిసి, మొత్తం 55 మంది సిబ్బంది ఉన్నారు. వారందరూ ఈ ప్రమాదంలో మరణించారు. ఈ జలాంతర్గామికి మరమ్మత్తులు చేసి పైకి తీసుకురావడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందట. ఇతర దేశాల సహాయాన్ని నిరాకరించిన చైనా ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. కానీ బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టులలో ఈ సంగతి బయటపడింది.