Andhra PradeshHome Page Slider

మూడు పార్టీల్లో స్టిక్కర్ల గోల

  • గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలు
  • ఆందోళనలు నిరసనలు ధర్నాలు బంద్‌లు వదిలేసి స్టిక్కర్ల పబ్లిసిటీ
  • ముక్కును వేలేసుకుంటున్న ప్రజలు

ఏ రాష్ట్రంలో అయినా గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే ఆయా పార్టీలకు సంబంధించి వాల్ పోస్టర్లు అంటించేవారు. అలానే ప్రతిపక్ష పార్టీలు తమ సత్తాని చాటుకోవడానికి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, బంద్ లు వంటి కార్యక్రమాలు చేపట్టి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేవారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు తమ మంత్రులు శాసనసభ్యులను ప్రజల్లోనే ఉండాలని అందులో భాగంగానే ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా నవరత్నాల మధ్యలో సీఎం బొమ్మ ఉండేలా స్టిక్కర్ను తయారుచేసి జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ నినాదాన్ని కూడా స్టిక్కర్లో ఉంచారు. ఆ తరహా స్టిక్కర్లను వైసీపీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి అంటిస్తున్నారు. దీంతో ప్రజల్లో వైయస్సార్సీపీకి మైలేజ్ పెరుగుతూ వస్తుంది.

ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా జోరు పెంచారు. తెలుగుదేశం పార్టీ నేతలు అంతా రోజు ప్రజల్లోనే ఉండాలని ప్రతి ఒక్కరు కష్టపడాలని దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. దీంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా తెలుగుదేశం పార్టీ కూడా స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని కృష్ణాజిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మాజీ మంత్రులు శాసనసభ్యులు నియోజకవర్గం ఇన్చార్జిలు కొన్ని నినాదాలతో స్టిక్కర్లు తయారుచేసి అంటిస్తున్నారు.

మరోవైపు జనసేన పార్టీ కూడా స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినోద్ రెడ్డి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనే నినాదంతో స్టిక్కర్లను తయారు చేసి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి అంటించారు. ఇదే తరహాలో కొన్ని జిల్లాల్లో కూడా జనసేన స్టిక్కర్ల కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో మూడు పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్ధం ఆ పార్టీ శ్రేణుల్లో కాకపొట్టిస్తుంది. జనం కోసం జనసేన అంటూ ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామంలో ఆ పార్టీ నేతలు ప్రచార పర్వం మొదలుపెట్టారు.

కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేపట్టలేదు. ఎన్నికల ముందు వాల్ పోస్టర్లు అంటించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరు పోటీగా స్టిక్కర్ల కార్యక్రమాన్ని చేపట్టటం ప్రతి ఇంటికి వెళ్లి స్టికర్లు అంటించడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేమి గోల రా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల్లో మైలేజీ తెచ్చుకోవాలని ఇలా అధికార పక్షం ఏది చేస్తే దాంతోపాటు చేయటం ద్వారా ప్రజల్లో ఎలాంటి మైలేజీ పెరగదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.