పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఏలూరు సభలో ఏపీ వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ వ్యాప్తంగా దుమారం రేగింది. వైసీపీ కార్యకర్తలు, నేతలు, నేతలు మండిపడుతున్నారు. మహిళలు అదృశ్యమవుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మహిళా కమీషన్ ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాలంటూ పవన్‌కు నోటీసులు జారీ చేసింది. పవన్ దిష్టిబొమ్మలను తగలబెడుతూ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు.

ఈ నేపథ్యంలో విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సురేష్ అనే వాలంటీర్ పవన్‌పై క్రిమినల్ కేసు పెట్టాడు. తమపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు జనసేన అధ్యక్షునిపై 153,153 ఏ, 502(2) ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాలంటీర్ల పొట్ట కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని, కొందరు జనవాణి సభలలో తమ ఆడపిల్లలను యువకులైన వాలంటీర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారని, అందుకే ఇలా అడిగానని పవన్ ఇంతకు ముందే వివరణ ఇచ్చారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ ఏపీ ప్రజల వ్యక్తిగత విషయాలను, డేటాను సేకరిస్తోందని, ఇది వారి భద్రతకు ముప్పు తీసుకురాగలదని పవన్ స్పష్టం చేశారు.

