టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ మెసేజ్..
ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా వెళ్తున్న ఇండిగో విమానంలో (6E 6650) ఆదివారం ఉదయం పెను కలకలం రేగింది. విమానం గాల్లో ఉండగా బాంబు బెదిరింపు రావడంతో పైలట్లు అత్యవసరంగా లక్నో విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. విమానంలోని టాయిలెట్‌లో ఒక టిష్యూ పేపర్‌పై “విమానంలో బాంబు ఉంది” అని రాసి ఉండటాన్ని సిబ్బంది గమనించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 238 మంది ప్రయాణికులు , సిబ్బంది ఉన్న ఈ విమానాన్ని లక్నోకు మళ్లించి, ఉదయం 9:17 గంటలకు సురక్షితంగా దించారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. విమానాన్ని ప్రత్యేకమైన ఐసోలేషన్ బేకి తరలించి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో అణువణువూ తనిఖీ చేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించి, వారి లగేజీని కూడా క్షుణ్ణంగా పరీక్షించారు. ఎంతో టెన్షన్ మధ్య జరిగిన ఈ తనిఖీల్లో ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఏసీపీ రజనీష్ వర్మ ధృవీకరించారు. విమానంలో 222 మంది పెద్దలు, 8 మంది చిన్నారులు , సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
ఎవరో ఆకతాయి టిష్యూ పేపర్ ద్వారా ఈ బాంబు బెదిరింపు నాటకానికి తెరలేపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా పరమైన ప్రోటోకాల్స్ అన్నీ పూర్తయిన తర్వాతే విమానాన్ని తిరిగి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న ప్రయాణికులకు లక్నో విమానాశ్రయంలో అల్పాహారం, వసతి కల్పించినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. టిష్యూ పేపర్‌పై ఆ మెసేజ్ రాసింది ఎవరు అనే కోణంలో భద్రతా ఏజెన్సీలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

