Home Page SliderNational

మాల్దీవులకు దెబ్బ మీద దెబ్బ

భారతదేశం, మాల్దీవుల వివాదం మధ్య గత వారం ప్రధాని నరేంద్ర మోడీ గురించి ముగ్గురు మంత్రుల వ్యాఖ్యల తర్వాత ఉధృతమయ్యింది. మాల్దీవుల పర్యాటక సంస్థ తన ప్లాట్‌ఫారమ్ ద్వారా విమాన బుకింగ్‌లను తిరిగి తెరవాలని భారతదేశానికి చెందిన ట్రావెల్ అగ్రిగేటర్ ఈస్‌మైట్రిప్‌ను కోరింది. మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ భారతదేశం గురించి, ప్రధాని గురించి మంత్రులు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ఇండియాను విమర్శించిన మంత్రులు, మాల్దీవుల ప్రజల మనోభావాలను ప్రతిబింబించలేదని పేర్కొంది.

కరోనా తర్వాత మాల్దీవులకు వెళ్లే విదేశీ పర్యాటకుల్లో అగ్రభాగం ఇండియా నుంచే అని ఆ దేశ టూరిజం శాఖ పేర్కొంది. భారత పర్యాటకలు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు కీలకమని చెప్పంది. మాల్దీవులు, ఇండియా మధ్య శాశ్వత స్నేహం, భాగస్వామ్యం కొందరు చేసే వ్యాఖ్యల ఆధారంగా ఉండబోదని అభిప్రాయపడింది. రాజకీయాలకు అతీతంగా కలిపే బంధాలను మీరు భారతీయులు గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. భారతీయులను… ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులుగా పరిగణిస్తామని అభిప్రాయపడింది. పర్యాటక రంగం మాల్దీవులకు జీవనాధారంగా నిలుస్తుంది. జీడీపీలో మూడింట రెండు వంతులకు పైగా సహకారం అందిస్తోంది. ఈ రంగంలో పని చేసే సుమారు 44,000 మంది మాల్దీవులకు జీవనోపాధి టూరిజం నుంచి వస్తుంది. తాజాగా అక్కడి మంత్రుల వ్యాఖ్యల వల్ల పర్యాటకంపై తీవ్ర ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామాలను కలిగిస్తోందని ఆందోళన చెందుతోంది.

భారతీయ పర్యాటకులు… మాల్దీవుల పర్యాటక రంగం విజయంలో విడదీయరాని ఒక శక్తి అని, అతిథి గృహాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కీలకమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, గత సంవత్సరం రెండు లక్షల మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు. గత రెండేళ్లలో 4.5 లక్షల మంది పర్యటించారు. కరోనా సమయంలోనూ సమయంలో పర్యాటకులకు ద్వారాలు తెరిచిన కొన్ని దేశాలలో మాల్దీవులు కూడా ఒకటి. దాదాపు ఆ సమయంలో 63 వేల మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు. భారతదేశంపై ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా.. రెండు దేశాల మధ్య విభజన తేవొద్దని.. ఆ దేశ టూరిజం శాఖ పిలుపునిచ్చింది. ప్రధాని మోదీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను, దేశ ప్రజల భవిష్యత్‌ను చిదిమేస్తోందంది.

మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో ఆ దేశానికి విమాన సేవలందించే ఈజ్ మై ట్రిప్ రంగంలోకి దిగింది. ఆ దేశానికి వెళ్లే ఇండియా బుకింగ్‌లను ఆపేసింది. ఇండియాకు వ్యతిరేకంగా ఏ చిన్న నిర్ణయాన్నైనా తాము విభేదిస్తామని ఆ సంస్థ పేర్కొంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పిట్టి తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ప్రధాని మోదీకి, దేశానికి ఈ సందర్భంగా తాము సంఘీభావం తెలుపుతున్నామంటూ ఆయన ట్విట్టర్‌లో సందేశాన్ని పోస్ట్ చేసారు. చలో లక్ష ద్వీప్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో లక్షద్వీప్‌లోని బీచ్‌లో… ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న ఫోటోను షేర్ చేశారు.

ఓవైపు ఇండియా నుంచి ప్రతికూలత ఎక్కువవుతుండటంతో, మొదట్నుంచి ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆదేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, చైనా పర్యటనలో మరింత రచ్చ చేశారు. మాల్దీవులకు మరింత మంది పర్యాటకులను పంపాలని ఆ దేశ అధ్యక్షుడు చైనా పర్యటనలో విజ్ఞప్తి చేసి.. పుండు మీద కారం జల్లారు. మొదట్నుంచి చైనా అనుకూలంగా వ్యవహరించే ఆయన మాల్దీవుల టూరిజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో చైనాను తమకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరారు. చైనా, ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపాలని కోరారు. తక్షణం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా ముందు ఏ విధంగా మాల్దీవులు, చైనా పర్యాటకులు వచ్చేవారు అలాగే రావాలని కోరారు. హిందూ మహాసముద్ర ద్వీపంలో మాల్దీవులు కేంద్రంగా… ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్‌ను అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు 50 మిలియన్ల అమెరికన్ డాలర్ల ప్రాజెక్ట్‌పై సంతకం చేసినట్లు మాల్దీవుల మీడియా పేర్కొంది. ఐతే చైనా మొదట్నుంచి దేశీయంగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తోందే గానీ.. ఇతర దేశాలకు టూరిస్టులను పెద్దగా పంపే విషయాన్ని ఆమోదించదు.


మొత్తం వివాదం ఎక్కడ రాజుకుంది.. అసలు ఎందుకు ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారిందో చూద్దాం… కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపించిన లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ట్విట్టర్‌లో ప్రధాని మోదీ పోస్ట్ చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రస్తుతం ట్విట్టర్‌లో బాయ్ కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్ల పోస్ట్‌ల ద్వారా మాల్దీవుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో లక్షదీవులపై క్రేజ్ అమాంతంగా పెరిగింది. మాల్దీవుల ముగ్గురు మంత్రులు – మల్షా షరీఫ్, షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మాజిద్ – ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనతో అందరి దృష్టి దానిపై పడింది. దీంతో దేశీయంగా చాలా మంది లక్షద్వీప్, మాల్దీవులను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది అక్కడి మంత్రులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఆ దేశ మంత్రి మరియం.. ప్రధాని నరేంద్రమోదీని జోకర్, తోలుబొమ్మ అంటూ ట్విట్టర్ సాక్షిగా విమర్శించింది. డబ్బు సంపాదించడానికి ఇండియా శ్రీలంకను కాపీ కొడుతుందని ఇంకొకరు, మాల్దీవులు అందిస్తున్న సేవలను ఇండియన్స్ అందించలేరని.. బీచ్‌లు, గదుల్లో వాసన వస్తోందని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.


దీంతో ఇండియాలో మాల్దీవులపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. భారత్-మాల్దీవుల మధ్య వివాదం చెలరేగింది. బాలీవుడ్ ప్రముఖులు అమితా బచ్చన్ నుంచి క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ వరకు ఆ దేశ మంత్రుల కామెంట్స్‌పై విరుచుకుపడ్డారు. దేశీయంగా ఎన్నో అద్భుతమైన బీచ్‌లు, పర్యాటక క్షేత్రాలు ఇండియాలో ఉన్నాయని రాసుకొచ్చారు. వివాదం అంతకంతూ పెరగడంతో మాల్దీవులు ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. మాల్దీవుల ప్రభుత్వం సైతం ఆ వ్యాఖ్యలను మాల్దీవులకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అయినప్పటికీ ఇండియాలో ఆ దేశంపై కోపం ఇసుమంతైనా తగ్గలేదు.

ఈ ఏడాది చివర్లో మాల్దీవుల్లో సాధారణ ఎన్నికలు… ధ్యక్షుడు ముయిజ్జాకు మూడినట్టేనని సీన్ కన్పిస్తోంది. మూడు పార్టీల పాలక కూటమిపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిపక్ష ఎంపీలు, రాజకీయ నాయకులు ఆయనను జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాన్ని ఎదుర్కొనేందుకు ఓటింగ్‌కు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు మాల్దీవుల రాయబారిని భారత ప్రభుత్వం పిలిచి మాట్లాడింది. అయితే మొత్తం వ్యవహారంపై ప్రధాని మోదీగానీ, విదేశాంగ మంత్రి జైశంకర్ గానీ ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.