మమతా సర్కార్ కు ఎదురు దెబ్బ
పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కింద చేపట్టిన 25వేలకు పైగా బోధనా, బోధనేతర సిబ్బంది నియామకాలకు రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. టీచర్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా మోస పూరితంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసును విచారించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం గతంలో కోల్ కత హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తిరిగి కొత్తగా నియామక ప్రక్రియ మొదలు పెట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. కొత్త ప్రక్రియలో తిరిగి ఉద్యోగం పొందిన సిబ్బందికి సంబంధించి వారు 2016 నుంచి తీసుకున్న వేతనాలు తిరిగి ఇవ్వనవసరం లేదని స్పష్టం చేసింది. వికలాంగులకు సడలింపు ఇచ్చిన ధర్మాసనం వారు ఉద్యోగాల్లో కొనసాగవచ్చని తెలిపింది.

