అలుపెరగని సుదీర్ఘ ప్రయాణంతో బుల్లిపిట్ట గిన్నిస్ రికార్డు
వేల కిలోమీటర్ల ఏకధాటి ప్రయాణం చేసి గిన్నిస్ రికార్డుకెక్కింది గాడ్‌విట్ అనే జాతికి చెందిన పక్షి. సంకల్పబలం ఉంటే చాలు ఇతర ఏరకమైన ఆధారం లేకపోయినా మహాసముద్రాలే ఈజీగా దాటేయవచ్చని నిరూపించింది. పగలు, రాత్రి లేదు, ఎండా,వానా లేదు, విశ్రాంతి లేదు, ఆకలి దప్పికలు మర్చిపోయి దాదాపు 11 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేసింది. పక్షులు వలస వెళ్లడం మామూలేనంటారా. కానీ ఈ రికార్డు అధికారికంగా నిరూపించబడిందండోయ్.

ఈ నెమలి జాతికి చెందిన పక్షికి ఒక నెంబరుతో 5జీ శాటిలైట్ ట్యాగ్‌ను కూడా మెడ భాగంలో కట్టారు. అమెరికాలోని అలస్కాలో మొదలుపెట్టిన ప్రయాణం ఆస్ట్రేలియాలోని టాస్మానియాకు చేరుకున్నాక గానీ ఆపలేదు. ఎక్కడా ఆగకుండా ఆహారం, నీరు కూడా తీసుకోకుండా నిరంతర ప్రయాణం కొనసాగించినట్లు రుజువయ్యింది. అలస్కా నుండి 11 రోజులలో ఆస్ట్రేలియాకు చేరుకుందట. ఈదూరం ఏకంగా భూమి చుట్టుకొలతలో మూడవభాగానికి సమానం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది సన్నని కాళ్లతో, చిన్నతోక, కాస్త పొడవైన ముక్కు కలిగి ఉంటుంది. నీటిపై తేలే శక్తి దీనికిలేదు. సముద్రంపై వాలితే మునిగిపోతుంది. ఇంతటి రిస్క్ తీసుకుని మహాసముద్రాలపై ప్రయాణించిందీ బుల్లిపిట్ట.

