Andhra PradeshHome Page Slider

టీకా వికటించి 3 నెలల శిశువు మృతి!

బుచ్చెయ్యపేట: అయితంపూడి గ్రామానికి చెందిన మూడు నెలల వయసున్న శిశువుకు తల్లిదండ్రులు బుధవారం వ్యాధి నిరోధక టీకా వేయించగా, గురువారం శ్వాస సంబంధ సమస్య తలెత్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితిరెడ్డి సతీష్, ధనలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలు. ధనలక్ష్మికి రెండో కాన్పులో బాబు జన్మించగా దీక్షితారామ్‌గా పేరుపెట్టారు. బుచ్చెయ్యపేట పీహెచ్‌సీలో బుధవారం వ్యాధి నిరోధక టీకా వేయించారు. గురువారం ఉదయం వరకు బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆ తర్వాత శ్వాస సరిగా ఆడక ఇబ్బంది పడుతుండడంతో గమనించి వెంటనే రావికమతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అప్పటివరకు ఆరోగ్యంగానే ఉన్న దీక్షితారామ్ అంతలోనే పరిస్థితి విషమించి చనిపోవడం టీకా వల్లేనని వారు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఎఎన్‌ఎం సూర్యకుమారికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె గురువారం సాయంత్రం అయితంపూడి చేరుకుని బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. టీకా కారణంగా చనిపోడానికి ఆస్కారం లేదని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే ప్రభావం చూపుతుందన్నారు. మరుసటి వరకు బాబు ఆరోగ్యంగానే ఉన్నట్లు మీరే చెబుతున్నారు, టీకా మాత్రం కారణం కాదని ఎఎన్ఎం పేర్కొన్నారు.