ఇకపై గోల్డ్ లోన్ అంత ఈజీ కాదు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిబంధనల ప్రకారం గోల్డ్ లోన్స్ పొందండం ఇకపై అంత ఈజీ కాదు. బంగారు రుణాల కోసం కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు రాబోతున్నాయి. బంగారు ఆభరణాలు హామీగా పెట్టి తీసుకునే రుణాలు ఇటీవల అత్యధికంగా పెరిగాయి. ఈ రుణాలలో ఆర్థిక అవకతవకలు, దొంగతనం ద్వారా వచ్చిన బంగారంతో లోన్లు వంటి తప్పిదాలను అరికట్టడానికి ఈ నిబంధనలు రూపొందించింది. తాకట్టు పెట్టిన బంగారానికి తగిన విలువను ధ్రువీకరించడంలో, బంగారం యాజమానుల నేపథ్యం విషయంలో బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు సరైన శ్రద్ధ వహించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రుణసంస్థలు రుణగ్రహీతలకు తెలియకుండానే, వారి బంగారాన్ని వేలం వేసిన సంఘటనలు కూడా జరిగాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆర్బీఐ కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అమలు చేయాలని, రుణ వినియోగాన్ని పర్యవేక్షించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు అన్నింటికీ ఒకే మార్గదర్శకాలను రూపొందించాలని ఆలోచిస్తోంది. తాకట్టు పెట్టిన బంగారం తమదేనని కూడా రుణగ్రహీతలు నిరూపించుకోవల్సి వస్తుంది.