రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ ఇవాళ తెలిపింది. అలాగే ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగిన వారు తమ పేరులో మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పుల కోసం కూడా ‘మీ సేవా’ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దీనిపై ప్రజలు అనవసమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మీ సేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన సేవలను ప్రారంభించాలని మీసేవా ఈఎస్ఓడీని పౌరసరఫరాల కమిషనర్ ఆదేశించారు.

