రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారంట్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. ముంబయిలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. అంతేకాదు, 3 నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయనపై 2018లో నమోదైన చెక్‌బౌన్స్ కేసు విషయంలో కోర్టుకు రావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా వర్మ హాజరు కాలేదు. దీనితో ఆగ్రహించిన కోర్టు ఈ కేసులో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది. పరిహారం చెల్లించకపోతే 3 నెలల జైలు శిక్ష తప్పదని ఆదేశించింది. ఇటీవల సత్య సినిమా 27 ఏళ్ల తర్వాత చూసిన రామ్ గోపాల్ వర్మ తనకు ఈ చిత్రం చూసి కన్నీళ్లొచ్చాయని, ఇకపై సరైన ప్రమాణాలు లేని, చెత్త సినిమాలు తీయనని ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిండికేట్ అనే కొత్త మూవీ ప్రకటించారు.