భారీగా రూపాయి పతనం..
భారత కరెన్సీ రూపాయి రోజురోజుకీ పతనమవుతోంది దీనితో ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమెరికా డాలర్‌తో పోల్చితే రూ.86.70 ఉంది. ఇంకా దిగజారి పోతోందని ఈ సంవత్సరంలో రూ.90కి చేరినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి పతనం వల్ల నిత్యావసరధరలు విపరీతంగా పెరిగిపోవడం, స్టాక్ మార్కెట్లు కుదేలవడం, కోట్ల రూపాయల సంపద స్టాక్స్‌లో ఆవిరయిపోవడం వంటి ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. నూతన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్న విధానాల వల్ల డాలర్ ఇంకా బలపడి రూపాయి బలహీనమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉంది. అక్కడ నిరుద్యోగం కేవలం 4 శాతం ఉంది. అక్కడ బాండ్లపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మదుపరులు భారత్ వంటి దేశాల నుండి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నాయి. గత ఐదు నెలలుగా విదేశీ మదుపరులు భారీగా తమ షేర్లు విక్రయించి, పెట్టుబడులు తీసుకున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ వంటి చమురు దిగుమతి బిల్లు భారమై, దేశానికి ఆర్థిక లోటు ఎక్కువయ్యింది. ద్రవ్యోల్బణం వల్ల కార్పొరేట్ సంస్థల ఆదాయాలు తగ్గుతున్నాయి. ఉద్యోగాలలో కోత, సరుకుల సరఫరా తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.

