వందేళ్ల వయసులో ప్రేమ-పెళ్లి..
ప్రేమకు- పెళ్లికి వయసు అడ్డు కాదంటూ నిరూపించిందో జంట. ఈ భూమి మీద అత్యధిక వయసులో పెళ్లి చేసుకున్న జంటగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు 102 ఏళ్ల మర్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తమ చివరి రోజులను సంతోషంగా గడపాలని ఒక వృద్ధుల సంరక్షణ కేంద్రంలో చేరారు వీరు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడడం, పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం. మొదటి వివాహానికి సంబంధించిన భాగస్వాముల మరణంతో వీరు ఒంటరయ్యారు. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకే వృద్ధాశ్రమంలో చేరారు. అక్కడ జరిగిన కమ్యూనిటీ ఈవెంట్లలో, పార్టీలలో వీరి మధ్య మాటలు మొదలయి, మనసులు కలిసాయి. వారిద్దరూ కలిసి ఉంటే జీవితాంతం సంతోషంగా ఉంటామని భావించి, కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. వారి ప్రేమకు యువత కూడా ఫిదా అయిపోతోందని, వారు ఈ వయసులో కూడా ప్రేమ కోసం పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందని వారి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే వీరు ఒకే యూనివర్సిటీలో చదువుకున్న విషయం ఇప్పుడు తెలుసుకుని ఆశ్చర్యపోయామని చెప్పడం ఆసక్తిగా మారింది. అదే అప్పట్లోనే ప్రేమించి, పెళ్లి చేసుకుని ఉంటే వందేళ్లు దాటినా జీవించి ఉన్న జంటగా కూడా రికార్డు సాధించేవారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


