ఆర్టీసీ బస్సులో గుండె పోటుతో వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండె పోటు రావడంతో మృతి చెందాడు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన డొంకెన పాండు గీత కార్మికుడు పని మీద మేడిపల్లికి వచ్చాడు. ఆర్టీసీ బస్సులో సోమవారం స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా, అన్నోజిగూడలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. బస్సు కండక్టర్ సీపీఆర్ చేసి ఘట్ కేసర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. తర్వాత మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

