మంటల్లో ఆంజనేయుడి విగ్రహం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర అపచారం జరిగింది. మహాదేవపూర్ మండలంలోని కాకతీయుల కాలంనాటి అమరేశ్వర స్వామి దేవస్థానం ఉపాలయంలో మంటలు చెలరేగడంతో గుడిలోని ఆంజనేయుడి విగ్రహం పూర్తిగా కాలిపోయింది. గురువారం సాయంత్రం దేవాలయంలో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో విగ్రహంపై ఎలాంటి వస్త్రం, అగ్నికి కారణమయ్యే ఎలాంటి వస్తువులు లేవని పూజారి నాగరాజు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారా అనేది తెలియడం లేదని చెప్పారు. అయితే.. ఇవాళ ఉదయం స్థానిక భక్తులు ఆలయంలో శాంతిపూజలు నిర్వహించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి..దర్యాప్తు చేస్తున్నారు.