హర్యానాలో బీజేపీ ఎందుకు గెలుస్తుందో చెప్పిన సీఎం నయాబ్ సింగ్ సైనీ
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కురుక్షేత్రలోని సైనీ సమాజ్ ధర్మశాలను సందర్శించి, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తోందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సైనీ కురుక్షేత్ర జిల్లాలోని లాడ్వా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. “మేము గత 10 సంవత్సరాలలో చాలా అభివృద్ధి పనులు చేసాం. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఏర్పాటు చేసిన వ్యవస్థ హర్యానాకు చాలా కాలం పాటు ప్రయోజనాలను తెస్తుంది” అని సైనీ విలేకరులతో అన్నారు. గత 10 ఏళ్ల అభివృద్ధి బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసివచ్చిందన్నారు. బీజేపీ గెలుపునకు అభివృద్ధి మాత్రమే కారణమని, రాజకీయాలు కాదని ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ హర్యానా, జమ్మూ- కాశ్మీర్ రెండింటిలోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి.

