Home Page SliderTelangana

‘పార్టీకి చెడ్డపేరు తేవద్దు’..రేవంత్‌కి కాంగ్రెస్ పెద్దల ఉపదేశం

తెలంగాణ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలపై బుల్డోజర్‌ను ప్రయోగించడంపై కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఈ విధానం వల్ల చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని ఉపదేశం చేసినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పెద్దలతో చర్చించేందుకు మంగళవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అలాగే పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిలో హైడ్రా పనితీరు గురించి కూడా చర్చకు వచ్చిందని సమాచారం. పేదలను రోడ్డుపాలు చేయవద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దంటూ ఏఐసీసీ పెద్దలు హితవు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ బుల్డోజర్ సంస్కృతి పైనే రాజకీయ, న్యాయ పోరాటాలు చేస్తున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలిత తెలంగాణలో అదే తరహాగా ఉంటే పార్టీ అప్రదిష్టపాలవుతుందని వ్యాఖ్యానించారు. దీనితో పాటు రాష్ట్రంలో పరిస్థితులు, నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.