ప్రజా భద్రత ముఖ్యం… రోడ్లపై మందిరమైనా, దర్గా అయినా…!
రహదారులపై… కాలువలు, కుంటలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించే ఏవైనా మతపరమైన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేయాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. దేశం లౌకిక స్వభావాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఒక చారిత్రాత్మక తీర్పులో ప్రజాభద్రత తప్ప ఇంకేది ముఖ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆక్రమణలను కూల్చివేత విషయంలో మతపరమైన అంశాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే విధంగా వర్తిస్తాయని పేర్కొంది. భారతదేశం లౌకిక దేశమని, మతంతో సంబంధం లేకుండా పౌరులందరిపైనా బుల్డోజర్ చర్యలు, ఆక్రమణల నిరోధక డ్రైవ్‌ల కోసం ఆదేశాలు ఉంటాయని సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది. నేరాలకు పాల్పడిన వ్యక్తులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల కేసుల విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. క్రిమినల్ కేసులో నిందితుడైనందు వల్లే వారిపై బుల్డోజర్ చర్య తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అలా చేయనే చేయడం లేదని మెహతా బదులిచ్చారు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల విషయంలో కూడా దూకుడు ప్రదర్శించడం లేదన్నారు. ముందుగా నోటీసులిచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలను కూల్చుతున్నామన్నారు. మునిసిపల్ చట్టాలను అనుసరించి నోటీసు జారీ చేయడానికి నిబంధనలంటాయని చెప్పారు. ఐతే మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. మొత్తం సమాచారం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉంటే ప్రజలు తెలుసుకుంటారని వాటన్నింటినీ డిజిటలైజ్ చేస్తే రికార్డు కూడా ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

ఈ సమయంలో సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకున్నారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కొన్ని ఉదంతాల ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. “అనధికార నిర్మాణాలకు, ఒక చట్టం ఉండాలి, అది మతం లేదా విశ్వాసం లేదా విశ్వాసాలపై ఆధారపడి ఉండదు” అని జస్టిస్ గవాయ్ అన్నారు. పిటిషనర్లలో ఒకరి తరఫు సీనియర్ న్యాయవాది సియు సింగ్ వాదిస్తూ, బుల్డోజర్ చర్యను నేరాల నిర్మూలన చర్యగా ఉపయోగించకూడదనేది తన ఏకైక ఉద్దేశమని అన్నారు. కానీ మైనారిటీలపై బుల్‌డోజర్ చర్య చాలా తక్కువగా ఉంటుందని మెహతా అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. అది ఒకరో ఇద్దరు కాదు.. 4.45 లక్షలు మంది అని పేర్కొంది.