శ్రీలంకకు నూతన మహిళా ప్రధాని
శ్రీలంకకు మూడవ మహిళా ప్రధానిగా హరిణి అమర సూరియ నియమింపబడ్డారు. క్యాబినేట్ పార్లమెంట్ సభాపక్ష నేతగా ఆమెను కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అనురకుమార్ దిసనాయకే నియమించారు. ఆమెతో అధ్యక్షుడు మంగళవారం ప్రమాణస్వీకారం చేయించారు. అధికార మార్పిడిలో భాగంగా శ్రీలంక పార్లమెంటును రద్దు చేశారు దిసనాయకే. ఈ సందర్భంలో ప్రస్తుత ప్రధాని దినేష్ గుణవర్ధనే తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీనితో విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు, హక్కుల కార్యకర్తగా ఉన్న హరిణి అమరసూర్యను అధ్యక్షుడు దిసనాయకే నియమించారు. నవంబర్ 14న శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఆమెకు విద్య, వైద్య, న్యాయ, వాణిజ్య శాఖలను అప్పగించారు. అధ్యక్షుడు దిసనాయకే రక్షణ, ఆర్థిక, ఎనర్జీ, ఫిషరీస్, వ్యవసాయ శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఇప్పటివరకూ శ్రీలంకకు ప్రధానులుగా ఉన్నవారిలో హరిణి అమర సూరియ మూడవ మహిళా ప్రధానిగా పేర్కొనవచ్చు. గతంలో సిరిమావో బండారు నాయకే, ఆమె కుమార్తె చంద్రికా బండారునాయకేలు ప్రధానులుగా పనిచేశారు.

