“టీటీడీ పై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు”… మాజీ సీఎం జగన్..
తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, టీటీడీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. తమ హయాంలో పవిత్రమైన టీటీడీ దేవాలయంలో లడ్డూ తయారీ విషయంలో నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు జగన్. లడ్డూ వివాదం ఘటనపై ఆయన నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయ ఎత్తుగడే అని ఆరోపించారు. టీటీడీకి నెయ్యి సరఫరాపై టీడీపీ విషప్రచారం చేస్తున్నారన్నారు. కల్తీనెయ్యి వ్యవహారమంతా కట్టుకథ అన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. జూలై 12నాడు రిపోర్టు వస్తే రెండు నెలల తర్వాత దీనిపై ఎందుకు మాట్లాడుతున్నారని అంటే తమ 100 రోజుల పాలనలో తప్పులు కప్పి పుచ్చడానికి ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక బోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. అది కప్పి పుచ్చడానికి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. లడ్డూ తయారీ నిరంతర ప్రక్రియ అని, 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఎల్-1గా వచ్చిన కంపెనీని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అసలు నెయ్యి కల్తీ జరిగింది చంద్రబాబు హయాంలోనే అంటూ ఆరోపించారు. టీటీడీ బోర్డును తమ హయాంలో ఎంతో ఉన్నతమైన మార్పులు చేశామని, విలువలతో గొప్పగా తీర్చిదిద్దామన్నారు. నెయ్యి కాంట్రాక్టును పద్దతి ప్రకారం టెండర్లు పిలిచి కేటాయించామని అన్నింటికీ సరైన ప్రమాణాలున్నాయన్నారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూ పరువును ప్రపంచం దృష్టిలో తక్కువ చేశారన్నారు. టీటీడీ పవిత్రతను మంటగలిపే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్న దీక్షాపరుడని, అంతకంటే గొప్ప వ్యక్తిని టీటీడీ ఛైర్మన్‌గా ఎవరు నిలబెట్టగలరన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఇదేనన్నారు. టీటీడీ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరిస్తుందని, దానిపై ప్రభుత్వం ఏ రకంగానూ ప్రభావం చూపించదన్నారు. జీర్ణవ్యవస్థలో ఉన్న దేవాలయాలను తమ హయాంలో పునరుద్ధరించామని పేర్కొన్నారు. జమ్ము కాశ్మీర్, చెన్నై, హైదరాబాద్, అమెరికా, అమరావతి వంటి నగరాలలో కూడా టీటీడీ బోర్డు తమ హయాంలోనే టీటీడీ దేవాలయాల నిర్మాణానికి పూనుకుందని చెప్పుకొచ్చారు. తమ పాలనలో దేశంలోని మఠాధిపతులందరితో విద్వత్ సదస్సులు నిర్వహించామన్నారు. ఏదైనా రాష్ట్రానికి మంచి జరిగిందంటే అది వైసీపీ హయాంలోనే అని గర్వంగా చెప్తున్నానని పేర్కొన్నారు. జాతీయ ఛానెల్స్‌లో కూడా వైసీపీ ప్రభుత్వంపై, టీటీడీ ట్రస్టుపై, తిరుమల దేవాలయంపై పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. వారికోసం తాను ప్రధాని మోదీకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా లేఖ రాస్తానని పేర్కొన్నారు.