రెండు దెయ్యాల్లో చిన్న దెయ్యాన్ని ఎంచుకోండి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండు దెయ్యాల్లో చిన్న దెయ్యాన్ని ఎన్నికోవాలని అమెరికన్లకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిస్తే అమెరికాలో అక్రమంగా నివశిస్తున్నవారందరినీ పంపించేస్తానంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో కలకలం రేగుతోంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థులిద్దరూ కూడా ప్రజలు జీవించడానికి వ్యతిరేకులన్నారు పోప్ ఫ్రాన్సిస్. డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానాలు, కమలా హారిస్ అబార్షన్ హక్కులకు మద్దతివ్వడం రెండు అంశాలు బతుకు భరోసాకు వ్యతిరేకమని పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం చెప్పారు. ఆసియాలో 12 రోజుల పర్యటన తర్వాత రోమ్‌కు తిరిగి వస్తూ విమానంలో విలేకరులతో ఫ్రాన్సిస్ మాట్లాడారు. ఇద్దరూ అమెరికా అధ్యక్ష అభ్యర్థులు జీవించడానికి వ్యతిరేకులని నిప్పులు చెరిగారు.

“నేను అమెరికన్‌ని కాదు. నేను అక్కడ ఓటు వేయను. కానీ స్పష్టంగా చెప్పనివ్వండి. వలసదారులను దూరంగా పంపడం, వలసదారులకు పని చేసే సామర్థ్యాన్ని ఇవ్వకపోవడం లేదా వారిని స్వాగతించకపోవడం పాపం, ఇది చాలా తీవ్రమైనది,” అని పోప్ చెప్పాడు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో తిరిగి వైట్‌హౌస్‌లో పట్టాభిషేకం జరిపించుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. అందులో భాగంగా అమెరికన్లను రెచ్చగొట్టేందుకు అక్రమ వలసదారులను బహిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాడు. 1973లో గర్భస్రావం మహిళలకు జాతీయ హక్కుగా మార్చారు. ఈ హక్కును పునరుద్ధరిస్తానని కమలా హ్యారిస్ ప్రతిజ్ఞ చేయడం కూడా అక్కడ ఎన్నికల అంశంగా మారింది.