‘సెబీ నిబంధనలకు కట్టుబడి ఉన్నా’..పెదవి విప్పిన చీఫ్
సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్‌పై హిండెన్ బర్గ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై మొదటిసారిగా పెదవి విప్పి మాట్లాడారామె. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ తప్పుగా, దురుద్దేశాలతో తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. తాను సెబీ నిబంధనలకు కట్టుబడి ఉన్నానన్నారు. అదానీ గ్రూప్ కంపెనీలపై కావాలనే దర్యాప్తు సరిగ్గా చేయట్లేదని ఆమెపై కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తోంది. అదానీ గ్రూప్‌లో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారు. పైగా ఆమె భర్త ధావల్ బచ్‌కు చెందిన కంపెనీ కూడా మాధవి దర్యాప్తు చేస్తున్న కంపెనీల నుండి ఆదాయాలను సంపాదిస్తోందని ఆరోపణలు చేశారు. ధావల్ మహీంద్రా, ఐసీఐసీఐ, రెడ్డీస్, పిడిలైట్ వంటి కంపెనీలకు పని చేశారు. దీనికి గాను ఆయనకు చెందిన అగోరా ఇండియా, అగోరా పార్ట్‌నర్స్‌కు చెల్లింపులు చేశామని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. ఆయన ఐఐటీ ఢిల్లీ నుండి ఇంజనీరింగ్ చదివి, 35 ఏళ్ల అనుభవంతో కన్సల్టెన్సీలు నడుపుతున్నారని పేర్కొన్నారు. ఆయన సలహాలను మాత్రమే అనుభవం దృష్ట్యా స్వీకరించడం తప్పు కాదని, ఏ కంపెనీలతో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని సెబీ చీఫ్ స్పష్టం చేశారు.

