రోజుకో సాయం.. 365 రోజుల టార్గెట్..
ప్రస్తుత ఆధునిక కాలంలో సాటి మనిషికి సాయం చేసేవారు చాలా అరుదు. రోడ్డుపై ప్రాణపాయ స్థితిలో ఉన్నా.. కనుకరించి సాయం చేసి ప్రాణాలు కాపాడేవారు నూటికి ఒక్కరు కనిపిస్తుంటారు. అలాంటి వారిలో యూట్యూబర్ శీను మాలిక్ ఒకరు. ప్రతి రోజూ ఏదో ఒక సాయం చేయడమే అతని లక్ష్యం. అలా 365 రోజులు చేయాలనేది అతని టార్గెట్. ప్రతిరోజూ ఏదో ఒక విధంగా సాయం చేస్తూ.. వీడియో తీస్తుంటాడు. ఆ వీడియో చూసి కొందరైనా తమ చుట్టు పక్కల ఉండే వాళ్లకు సాయం చేస్తారేమో అనే చిన్న ఆశ అతనిది. అందుకే ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు శీను మాలిక్. దాని వల్ల అతనికి లాభమా? నష్టమా? అనేది పక్కన పెడితే.. నలుగురికీ సాయం చేయాలనే ఆలోచన మాత్రం అతనిలో చాలా బలంగా కనిపిస్తోంది. అవసరం ఉన్న వాళ్లకు సాయం చేసే గుణమే శీనుని ఎంతో మంది హృదయాల్లో ఉండేలా చేసింది.
అసలు శీను మాలిక్ ఎవరు?
యూట్యూబర్ శీను మాలిక్ (అసలు పేరు రవికుమార్). శీను ఢిల్లీ నివాసి. వాళ్లది ఉన్నత కుటుంబం. చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని అనుకున్నాడు. కానీ.. కుదర్లేదు. సరిగ్గా ఏడాది క్రితం 2023 ఆగస్టు 24న ‘శీను మాలిక్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు 250కి పైగా వీడియోలు అప్లోడ్ చేశాడు. వాటిలో చాలావరకు షార్ట్ వీడియోలే. అయితే… ఛానెల్ పెట్టిన కొత్తలో వ్యూస్ అంతగా రాలేదు. తర్వాత శీను దుబాయి వెళ్లాడు. అక్కడ వ్లాగ్స్ తీసి అప్లోడ్ చేశాడు. అయినా… అంతగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత 365 డేస్ ఛాలెంజ్ మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా.. ప్రతిరోజు ఒకరికి సాయం చేసి.. ఆ వీడియోని అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో సబ్ స్ర్కయిబర్స్, వ్యూస్ పెరుగుతూ వచ్చాయి. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 230కి పైగా వీడియోలు చేశాడు. ఛానెల్ పెట్టి ఏడాది కూడా దాటకముందే… దాదాపు 8 లక్షల మంది సబ్ స్క్రయిబ్ చేసుకున్నారు. అంతేకాదు.. చాలా వీడియోలకు మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. కాళ్లు లేని వ్యక్తికి సాయం చేసిన ఒక వీడియోకు 28 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఛానెల్ లో మిలియన్ వ్యూస్ దాటిన వీడియోలు ఇంకా చాలానే ఉన్నాయి.

