తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్
తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్‌ను ప్రకటించింది ఏఐసీసీ. అనేక తర్జనభర్జనల అనంతరం మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షునిగా నియమించారు. ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం అనంతరం ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికవడంతో మరో కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికపై కసరత్తులు ప్రారంభించింది హైకమాండ్. రెండు వారాల క్రితమే ఈ విషయంపై క్లారిటీ వచ్చినా ఇంతవరకూ పేరు బయటకు ప్రకటించలేదు. తాజాగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించింది. ఈ నియామకంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కే.సీ.వేణుగోపాల్ నియామక ఉత్తర్వు జారీ చేశారు. మహేశ్ కుమార్ గౌడ్‌కు గత ఎన్నికలలో తొలుత నిజామాబాద్ అర్బన్ నుండి పోటీకి దింపాలని చూసినా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆ స్థానాన్ని కోరడంతో సీటు కేటాయించలేకపోయారు. దీనితో ఆయనను కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్ వంటి సీనియర్లు ఉన్నా రేవంత్ రెడ్డి సూచనలతో పీసీసీ అధ్యక్ష పదవి మహేశ్ కుమార్ గౌడ్‌ను వరించింది.