వరద బాధితులకు సింహాచలం పులిహోర ప్రసాదం
ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి దారుణంగా ఉంది. నగరంలోని అనేక కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సింగ్ నగర్ పూర్తిగా జలదిగ్బందంలోకి వెళ్ళిపోయింది. ఈ వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండు సార్లు పర్యటించారు. వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో.. సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ పట్టణంలోని సింహాచలం ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి బాధలు తీర్చేందుకు సింహాచలం ఆలయం నుంచి 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైలులో 10 వేల ప్యాకెట్లు ఆలయ అధికారులు పంపారు. మధ్యాహ్నం మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 10 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు చేరాయి.

