“ఇది ఏదో కొన్ని రోజుల హడావిడి కాదు”.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక
హైడ్రా కూల్చివేతలు కేవలం కొన్ని రోజుల హడావిడి కాదని, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే భయపడి వణికేలా చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇది నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతులున్నా సరే వాటిని కూల్చేస్తామని పేర్కొన్నారు. వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోపే వాటిని నేలమట్టం చేస్తామన్నారు. అలాగని FTL, బఫర్ జోన్లలో ఉండే ప్రతీ అపార్టమెంట్‌ను, భవనాన్ని కూల్చడం లేదని, కేవలం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాలనే ప్రస్తుతం కూల్చేస్తున్నామని పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేసుకునే బిల్డర్లను ఇబ్బంది పెట్టడం లేదని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

