భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌లోని బీఎన్పీ పార్టీ డిమాండ్ చేస్తోంది. బంగ్లాదేశ్‌లో ఆమెపై హత్యానేరం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఆమె విచారణను ఎదుర్కొనవలసి ఉందని ఆమెకు భారత్ ఆశ్రయం కల్పించడం విచారకరం అంటూ అభియోగాలు వేస్తోంది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి 400 పైచిలుకు ప్రజలు చనిపోయారు. ఈ మృతుల కుటుంబాలు వారి మరణాలకు హసీనానే కారణమంటూ కేసులు పెడుతున్నారు. ఆమెపై ఇప్పటి వరకూ 31 కేసులు నమోదు కాగా, వాటిలో 28 హత్యానేరం కిందనే నమోదు కావడం గమనార్హం. ఆమెతో పాటు ఆమె కుమారుడు సాజీద్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్, సోదరి షేక్ రెహానాను కూడా ఈ హత్యా కేసులలో సహ నిందితులుగా కేసులు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు మొదలు కాగానే ఆమె తన సోదరితో కలిసి, ప్రత్యేక మిలటరీ విమానంలో కట్టుబట్టలతో భారత్‌కు వచ్చేశారు. ఇక్కడ నుండి యూకేకు వెళ్లాలని ప్రయత్నించినా ఇప్పటి వరకూ ఆమెకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో భారత్‌లోనే ఉండిపోయారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయిన సంగతి తెలిసిందే.