కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు…
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది సుప్రీంకోర్టు. సుమోటోగా ఈ కేసును స్వీకరించి, విచారణ ప్రారంభించింది. నేడు సుప్రీంకోర్టులో ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభమయ్యింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా వైద్యులు, ఇతర మహిళా వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నించింది. ఈ ఘటనపై 12 గంటల ఆలస్యంగా FIR ఎందుకు నమోదు చేశారని పోలీసులను ప్రశ్నించింది. ఆత్మహత్యగా ఎందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. వైద్యుల భద్రత కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ ఘటనపై గురువారంలోగా దర్యాప్తు గురించిన వివరాలను రిపోర్టు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ ఘటనపై వైద్యసిబ్బంది కోపం తారాస్థాయికి చేరుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకే మాన ప్రాణాలకు రక్షణ లేదంటూ ఉద్యమిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఆగస్టు 17న బంద్ ప్రకటించాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పిలుపుపై స్వచ్ఛందంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది విధులను బహిష్కరించారు. పనిచేసే ప్రదేశంలోనే రక్షణ కరువైతే రోడ్డుపై ఆడపిల్లల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. వైద్య సిబ్బందికి ఆసుపత్రులలో రక్షణ కల్పించాలని, ప్రత్యేక చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

