Home Page SliderTelangana

“కేసిఆర్ ను నమ్ముకుంటే ఉన్న ఇల్లు పాయె… గుడిసె పాయె”..మంత్రి విమర్శలు

‘వెనకటికి ఒకడు ఉన్న ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా’ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనం ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.  ప్రజలు కేసిఆర్ ను నమ్ముకుంటే ‘ఉన్న ఇల్లు పాయె… గుడిసె పాయె’ అంటూ ఎద్దేవా చేశారు. తన పుట్టినిల్లు అయిన చింత మడక గ్రామంలో అప్పటి సీఎం హోదాలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చి వేసి ఇప్పటివరకు వారికి నిలువ నీడ లేకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.  దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్పాలు పలికిన ఆయన ఉన్న ఉరోళ్లకే పంగ నామాలు పెట్టారని విమర్శించారు. చింతమడకలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మించి ఇస్తానని 22 జులై 2019 లో ఆర్భాటంగా ప్రకటించారు. పెద్ద సారు చేసిన ప్రకటనను నమ్మి తమ ఇళ్లను, గుడిసెలను అక్కడి నిరుపేదలు సర్కారుకు అప్పగించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వాటిని కూల్చి వేశారు. కానీ…ఇల్లు రాలేదు ఉన్న ఇల్లు పోయింది, గుడిసె పోయింది. లబ్ధిదారులకు కేటాయించినా కొన్ని ఇళ్లకు తాళం చెవులు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేసిన ఇండ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదు” అని తెలిపారు. “హామీలు ఇవ్వడమే కాదు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమని, ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు ఒక కల… అది నెరవేరితే పేదవాడి ఇంట పండుగే అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ళకు పూర్తి న్యాయం జరుగుతుంది. అని హామీ ఇచ్చారు. తక్షణమే చింతమడకలో పర్యటించి ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని ఎలాంటి భేషజాలకు పోకుండా వీలైనంత త్వరగా అక్కడి ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.