ప్రపంచ ఆహార భద్రతకు భారత్ హామీ..నరేంద్రమోదీ
ప్రపంచ ఆహార భద్రత కోసం భారత్ చాలా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్తల 32వ సదస్సులో పేర్కొన్నారు. ఈ సదస్సు శనివారం న్యూఢిల్లీలో ప్రారంభించారు. సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో 75 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్కరణ ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యవసాయమే కేంద్రం అని అని పేర్కొన్నారు మోదీ. ఆహార ధాన్యాలు, చిరు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పాలు, పప్పుదినుసుల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. గత పదేళ్లలో 1900 రకాల కొత్త పంటలను ప్రభుత్వం అందించిందని, వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. పది కోట్ల మంది రైతుల ఖాతాలకు కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులు బదిలీ చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.


 
							 
							