“బడ్జెట్‌పై ఇండియా కూటమి నేతల దుష్ప్రచారం-ప్రజలలో దురభిప్రాయం కలిగిస్తున్నారు”..నిర్మలా సీతారామన్
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేవలం ముఖ్యాంశాలు మాత్రమే ప్రస్తావిస్తాం. ప్రతీ రాష్ట్రం పేరును ఆయా రాష్ట్రాలకిచ్చిన గ్రాంట్లను ప్రస్తావించే అవకాశం రాదు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజలలోకి వ్యతిరేకంగా తీసుకెళ్లి, ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బడ్జెట్‌పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విపక్షాలను దుయ్యబట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఒక రాష్ట్రం పేరు ప్రస్తావించలేనంత మాత్రాన ఆ రాష్ట్రానికి ఇవ్వవలసిన గ్రాంట్లను ఇవ్వలేదనుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాల ప్రజలను వారు తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించలేదనే దురభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని ఆరోపణలు చేశారు. కేంద్రం ప్రతీ రాష్ట్రానికి ఆమోదించిన పనులన్నీ చేస్తుందని, నిన్న బడ్జెట్‌లో మహారాష్ట్రలోని వందవన్‌లో పోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పలేదు కదా. కానీ కేబినెట్ నిర్ణయం ప్రకారం పోర్టు ఏర్పాటు చేస్తుంది. దీనిని బడ్జెట్‌లో ప్రస్తావించలేదు అని ఉదాహరణగా పేర్కొన్నారు. నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ ఆమె బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చారు. కానీ ఆమె సమాధానంపై ఇండియా కూటమి నేతలు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. రైతులకు కనీస మద్దతు ధరపై చట్టబద్దత కల్పించలేదని, తమ మిత్రపక్షాలకు మాత్రమే మద్దతు ధర ఇచ్చారని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ బడ్జెట్‌లో రాష్ట్రాల మధ్య సమతుల్యత లేదని, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. దీనిని తమ కూటమి ఖండిస్తోందని, నిరసనలు తెలియజేస్తున్నాం అన్నారు.