రోబోలకు మానవమెదడు
చైనాలోని టియాంజిన్ యూనివర్సిటీ, సదరన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు సంయుక్తంగా మానవమెదడుతో రోబోను రూపొందించారు. దీని గురించి తెలుసుకుంటే రోబోలు మనుషులను నియంత్రించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. రోబోలను పూర్తి మానవులలా చూపించడానికి, పని చేయించడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో ముఖ్యమైనది మానవ మెదడును రోబోకు అనుసంధానించడం. వీటి సహాయంతో రోబోలు ఫాక్టరీలలో పనిచేయడానికి, దివ్యాంగులకు, వృద్ధులకు సహకరించడానికి పనికి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చైనా పరిశోధకులు కంప్యూటర్ చిప్‌లపై బ్రెయిన్‌ను రూపొందించారు. ప్రపంచంలోనే తొలిసారిగా నిజమైన మెదడును అమర్చారు. ఈ మెదడు సాయంతో వస్తువులను పట్టుకోవడం, అడ్డంకులు అధిగమించడం వంటి పనులు రోబోలు తేలికగా నేర్చుకున్నాయట. ఈ మెదడు మానవ పిండం యొక్క మూలకణాలను ప్రయోగపాత్రలో ఉంచి, స్వయంగా సంయోగం, విభజన చెందేలా చేసి తయారు చేశారు. దీనితో ఇది ఎదుగుతున్న మెదడుగా ప్రవర్తిస్తుంది. దీనిని ఎలక్ట్రోడ్లతో కూడిన చిప్‌పై పెట్టి రోబో తల భాగంలో అమర్చారు. దీనికి ఎలాన్ మస్క్ చేసిన న్యూరాలింక్ చిప్ ఆవిష్కరణే పునాది. ఇది మనిషి మెదడులో అమర్చిన తర్వాత దీని సాయంతో కంప్యూటర్‌ను నియంత్రంచవచ్చు. ఇటీవల అవయవాలు చచ్చుబడిన ఒకవ్యక్తికి దీనిని అమర్చారు. దీనితో పాటలు వినడం, చదరంగం ఆడడం, కంప్యూటర్‌పై కర్సర్‌ను కదిలించడం వంటి పనులు చేయగలిగాడట. రోబోను పూర్తి మనిషి రూపంలో తయారు చేయడానికి జరిగే ప్రయత్నాలలో మనిషి చర్మం అతికించే విధానం కూడా గుర్తించారు. చర్మం, రక్తనాళాలు, కొవ్వు, నాడులను జోడించడం ద్వారా చర్మాన్ని సృష్టించవచ్చు. దీనితో పరిసరాలను కచ్చితంగా గుర్తిస్తూ రోబోలు నైపుణ్యంతో పనిచేయగలుగుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
