Andhra PradeshHome Page Slider

‘సన్యాసం తీసుకుందామనుకున్నా’..జగన్ సంచలన వ్యాఖ్యలు

‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి షాక్ అయ్యా.. సన్యాసం తీసుకుని, అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా’ ఈ మాటలు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్ చెప్పిన మాటలు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో జరిగిన సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టి, ఇంటింటికీ వాలంటీర్ల ద్వారా సేవలు చేసినప్పటికీ ఓటమి పాలవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ షాక్ నుండి తేరుకుని ప్రపంచంలో పడేసరికి మూడు రోజుల సమయం పట్టిందన్నారు. సర్వేలు కూడా చేయించామని, అన్ని ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయన్నారు. ఎక్కడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని, ఎంతో మెచ్చుకున్నారని తనకు అర్థం అయ్యింది. అందుకే చాలా విశ్వాసంతో ఉన్నా. ‘ఎలాగైనా గెలుస్తామనుకున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని తెలిసాక కుదుట పడ్డానని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుండి బయటపడి, తనను నమ్మి ఓట్లు వేసిన 40 శాతం మంది ప్రజలకోసం, పార్టీ కోసం ఏమైనా చెయ్యాలని వ్యాఖ్యానించారు. తిరిగి ప్రజలలోకే వెళ్తామని, పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తామని అభ్యర్థులకు సూచించారు.