Home Page SliderTelangana

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన తెలంగాణా మంత్రులు

కాంగ్రెస్ సీనియర్ నేత,పీసీసీ మాజీ అధ్యక్షుడు,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా తెలంగాణా నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా,మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి..రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.ఈ నేపథ్యంలో డీఎస్ మృతిపట్ల తెలంగాణా మంత్రులు సంతాపం ప్రకటించారు.

ధర్మపురి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్

ధర్మపురి మరణం పట్ల తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు.ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారనిఆయన గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు.సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డీఎస్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు విశేష సేవలందించారన్న మంత్రి కొండా సురేఖ
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ గారు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు విశేష సేవలందించిన డిఎస్ మన మధ్య లేకపోవడం విచారకరమని మంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి సురేఖ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సుదీర్ఘ కాలం పార్టీలో డీఎస్‌తో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
డి.శ్రీనివాస్ అకాల మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి గా ,పీసీసీ చీఫ్ గా చేసిన సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డిఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

డీఎస్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ గారి మృతి పట్ల పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అనసూయ సీత‌క్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఏపీ పిసిసి అధ్యక్షుడిగా వారు చేసిన సేవలను సీతక్క గుర్తు చేసుకున్నారు. వారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీతక్క, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

డీఎస్ కిందిస్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయి కి చేరుకున్నారన్న మంత్రి శ్రీనివాస రెడ్డి
మాజీ మంత్రి, PCC మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ మృతికి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పీ.శ్రీనివాస రెడ్డి సంతాపం తెలిపారు . కాగా డీఎస్ కిందిస్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయి కి చేరుకున్నారన్నారు.డి. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.