యూపీలో అరడజనుకు పైగా ఎస్పీ, కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత కత్తి!
ఇండియా బ్లాక్‌కి కొత్తగా ఎన్నికైన కనీసం ఆరుగురు ఎంపీలు క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీరికి రెండేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఘాజీపూర్ నుంచి గెలుపొందిన అఫ్జల్ అన్సారీ గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో ఇప్పటికే నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఆయన నేరారోపణపై అలహాబాద్ హైకోర్టు గత నెలలో స్టే విధించింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన జులైలో ఈ అంశంపై విచారణ జరగనుంది. కోర్టు శిక్షను సమర్థిస్తే, అన్సారీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. అజంగఢ్ సీటును గెలుచుకున్న ధర్మేంద్ర యాదవ్‌పై కూడా నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లకు పైగా దోషిగా తేలితే, సభ్యత్వాన్ని కూడా కోల్పోవచ్చు. రాజకీయాల్లో తన పదేళ్ల ప్రవాసాన్ని ముగించుకుని జాన్పూర్ సీటును గెలుచుకున్న బాబు సింగ్ కుష్వాహా, మాయావతి హయాంలో మంత్రిగా పనిచేసిన ఎన్ఆర్హెచ్ఎం స్కామ్‌కు సంబంధించి అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. ఆయనపై నమోదైన 25 కేసుల్లో ఎనిమిదింటిపై అభియోగాలు నమోదు చేశారు.

సుల్తాన్పూర్ స్థానం నుంచి బీజేపీకి చెందిన మేనకా గాంధీని ఓడించి గెలుపొందిన రాంభూల్ నిషాద్పై గ్యాంగ్స్టర్స్ చట్టం కింద ఒక కేసుతో సహా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలో ‘బలహీనమైన’ విజేతలలో ఆయన కూడా ఉన్నారు. చందౌలీ లోక్‌సభ స్థానం నుంచి మాజీ మంత్రి మహేంద్ర నాథ్ పాండేపై విజయం సాధించిన వీరేంద్ర సింగ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మరో ఎస్పీ అభ్యర్థి. సహరాన్పూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈడీ ద్వారా మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసు ఒకటి ఉంది. అతనిపై రెండు కేసుల్లో అభియోగాలు నమోదయ్యాయి. నగీనా రిజర్వ్డ్ స్థానంలో గెలిచిన ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన ఏడో అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్‌పై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏదైనా ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడితే అతని రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పటి వరకు అనేక మంది రాజకీయ నేతలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి తమ సభ్యత్వాన్ని కోల్పోయారు. వారిలో ప్రముఖులు మొహమ్మద్ ఆజం ఖాన్, ఎస్పీకి చెందిన ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం ఉండగా… ఖబూ తివారీ, విక్రమ్ సైనీ, రామ్ దులార్ గోండ్, కుల్దీప్ సెంగార్, అశోక్ చందేల్ పలువురు బీజేపీ నేతలున్నారు.