Home Page SliderTelangana

మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

మిర్జాలగూడ చౌరస్తా -మల్కాజిగిరి చౌరస్తా, 1.3 కిలోమీటర్ల మేర రోడ్‌షో
రోడ్లకు ఇరువైపులా భారీ సంఖ్యలో బీజేపీ మద్దతుదారులు, స్థానికులు

రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్‌షోతో ప్రారంభించారు. మిర్జాలగూడ చౌరస్తా నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు 1.3 కి.మీ మేర జరిగిన రోడ్‌షోలో రహదారులకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో బీజేపీ మద్దతుదారులు, స్థానికులు గుమిగూడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి జి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి లోక్‌సభ స్థానం అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షోలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.. శుక్రవారం మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో మోదీ రోడ్‌షో అశేష జనవాహిని మధ్య విజయవంతమైంది. ఈ సందర్భంగా మోదీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. కాషాయ రంగు టోపీ ధరించిన మోడీ ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనానికి అభివాదం చేస్తూ… ప్రజలకు షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప యాత్ర నేపథ్యంలో మల్కాజిగిరి, మీర్జాలగూడ వీధులు కాషాయమయం అయ్యాయి. బీజేపీ జెండాలు, కండువాలతో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాని మోదీ రోడ్ షోలో ఆయన వెంట వాహనంపై కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నారు. తొలుత మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది.

బీజేపీ కార్యకర్తలను హుషారెత్తించేలా మోదీ రోడ్​ షో సాగింది. దారిపొడవునా కార్యకర్తలు, అభిమానులు మోదీపై పూలవర్షం కురిపించారు. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు మోదీ.. మోదీ.. మోదీ.. అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై భారత్​, జై జై మోదీ, ఔర్​ఏక్​బార్​మోదీ సర్కార్​ అంటూ మల్కాజిగిరి ప్రజలు నినాదాలు చేయడం విశేషం. దీంతో మీర్జాలగూడ, మల్కాజిగిరి వీధులు మోదీ నినాదాలతో మార్మోగాయి. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌ రోడ్డు వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో కొనగింది. మల్కాజిగిరిలో ఎక్కడ చూసినా అశేష జనవాహినితో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. రోడ్ షోలో మోదీతో పాటు 5 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు. మోదీని చూసేందుకు అపార్ట్​మెంట్లు, మిద్దెలు ఎక్కిన జనంతో కిక్కిరిసిపోయాయి. మోదీని చూసి అశేష జనవాహిని పులకించిపోయింది. తమ అభిమాన నేతపై భవనాల పైనుంచి పూలవర్షం కురిపించారు.
దారిపొడవునా మహిళలు హారతులు ఇస్తూ కనిపించారు.

ఆరేళ్ల చిన్నారులనుంచి వృద్ధుల వరకూ వయసును కూడా లెక్కచేయక మోదీ రాక కోసం నిరీక్షిస్తూ కనిపించారు. మోదీని చూడగానే ఒక్కసారిగా వాళ్ల కళ్లలో అలసట మాయమైపోయింది. నెల రోజులుగా వరుస పర్యటనలతో ఉన్న మోదీ మొహంలో ఎలాంటి అలసట కనిపించకపోవడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో చాలా చురుగ్గా ఉంటారు. ఏ మాత్రం అలసిపోకుండా చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఏకధాటిగా కొన్ని గంటలపాటు ప్రయాణం చేసినా.. వరుసగా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినా ప్రధాని మోదీ అలసటను మాత్రం దరిచేరనియరు. అందుకే ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారని అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలలో.. బిజీ షెడ్యూల్‌ ఉన్నా.. ఆయన అలసటను మాత్రం దరిచేరనీయరు. రోడ్ షో సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రోడ్లలో ట్రాఫిక్ ను మళ్ళించారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

డప్పు వాయిద్యాల మధ్య రోడ్‌షో సందర్భంగా మహిళలు, పిల్లలు సహా స్థానికులు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. మోదీ తన వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని రోడ్‌షో సాగిన ప్రాంతమంతా ట్రాఫిక్‌ను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. అంతకుముందు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన కాన్వాయ్ బేగంపేట, పిఎన్‌టి జంక్షన్, రసూల్‌పురా, సిటిఓ ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్‌రోడ్స్, ఆలుగడ్డబావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్ మరియు మెట్టుగూడ రోటరీ మీదుగా మీర్జాల్‌గూడ జంక్షన్ నుండి మల్కాజిగిరి క్రాస్ రోడ్ వరకు రోడ్ షో కొనసాగింది. రోడ్ షో అనంతరం రాత్రి బస చేయనున్న ప్రధాని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో, మార్చి 18న మళ్లీ జగిత్యాలలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగిస్తారు.