Home Page SliderNational

కాంగ్రెస్ నెత్తిన మహా బాంబ్.. వరుస దెబ్బలతో విలవిల


కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పుంజుకొని సత్తా చాటాలని భావిస్తున్న ఆ పార్టీకి సొంత పార్టీ నేతలు హ్యాండిస్తూ ఆ పార్టీ ఫ్యూచర్‌ను వెక్కిరిస్తున్నారు. మహారాష్ట్రలో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతమున్న బిజెపి-ఎక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సర్కారును కూలదోసి అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెప్తోండటంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కక్కా లేకా.. మింగా లేకా అన్నట్టుగా నిట్టూర్చుతోంది. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కీలక నేత అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో అక్కడి రాజకీయాలు హీటెక్కాయి.


మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆ పార్టీకి సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ సీఎం అశోక్ చవాన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో బోకర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చవాన్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఇవాళ ఆయన మహారాష్ట్ర స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అశోక్ చవాన్ బిజెపి గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెలాఖరున జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో సీనియర్ నాయకుడు మిలిందేవర కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి… ఎక్ నాథ్ షిండే నేతృత్వంలోనే శివసేనలో చేరారు.


తాజాగా అశోక్ చావన్ బిజెపి గుటికి చేరడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సర్కారు కూల్చివేత తర్వాత అక్కడి పరిణామాలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. థాక్రే సర్కారును కూల్చాక… అక్కడి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ శతథా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో, వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు గ్రౌండ్ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఆ పార్టీ యోచిస్తోంది. వలసలతో హస్తం పార్టీకి ఊపిరాడకుండా చేస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బిజెపి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఓవైపు బీజేపీని బలోపేతం చేసుకోవడంతోపాటుగా మరోవైపు చిలీక వర్గాలైన శివసేన, ఎన్సీపీలను సైతం తగిన విధంగా తీర్చిదిద్దే బాధ్యతను బీజేపీయే భుజస్కందాలపై వేసుకున్నట్టుగా కన్పిస్తోంది.

ఇటీవల శరద్ పవార్ నేతృత్వంలోని ఈసీ ఝలక్ కూడా ఇందులో భాగమని చెప్పాల్సి ఉంటుంది. ఎన్సీపీకి పార్టీ పేరు, సింబల్ పోవడంతో వచ్చే రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా అశోక్ చవాన్… రాజీనామాను పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ పనిచేసిన నేత, కీలక సమయంలో పార్టీకి గుడ్ బై చెప్పడం నమ్మక ద్రోహమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర పార్టీ చీఫ్ నానా పటోలేతో చవాన్‌కు విభేదాలే ప్రస్తుతం ఆయన పార్టీ మారడానికి కారణమని తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్‌రావ్ చవాన్ కుమారుడు, అశోక్ చవాన్ నాందేడ్ ప్రాంతంలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. ఈ మార్పు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీస్తోందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.


అశోక్ చవాన్ ఇప్పటి వరకు రాజకీయంగా సుస్థిర స్థానాన్ని ఏర్పాటుచేసుకున్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ప్రారంభించి, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునితో సహా కాంగ్రెస్‌లో కీలక పదవులను చేపట్టారు. రెండు సార్లు నాందేడ్ నుంచి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర శాసనసభ ఉభయ సభల్లో సభ్యుడిగానూ పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తర్వాత, ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ పదవీవిరమణ చేయడంతో ఆయన ముఖ్యమంత్రి నియమితులయ్యారు. 2009 రాష్ట్ర ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆయనను అత్యున్నత పదవికి ఎంపిక చేసినప్పటికీ… ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల మధ్య చవాన్ పదవీకి రాజీనామా చేశారు.

చవాన్ రాజీనామా వాషింగ్ మిషన్లో బట్టలను సాఫ్ చేయడంతో సమానమన్న భావనతో పోల్చారు కాంగ్రెస్ కీలక నేత జైరామ్ రమేష్. పార్టీ మారే ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ కేసుల విచారణను కేంద్రం నిలిపివేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ద్రోహులు పార్టీ మారడం వల్ల భవిష్యత్ ను చూడలేకపోతారని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దాంట్లో భాగంగా బీహార్ లో ప్రభుత్వం మార్పిడి, ఇప్పుడు తాజాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీని డామేజ్ చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. అందులో భాగమే అశోక్ చవాన్ కు రాజ్యసభ ఎర.